Thathva Rahasyaprabha    Chapters   

''శ్రీ గురుదేవదత్త''

పరిచయము

లోకమున మానవుని ప్రగతికి విద్యాసంపత్తి నిదానభూత మనునంశము జగద్విదితము. అట్టి యధార్థ విద్యాసంపత్తి లుప్తప్రాయమున సాక్షాత్‌ కైలాసధాముడైన పరమేశుడు విద్యాశంకరరూపమున నవతరించి జగజ్జేగీయమాన మగునట్లు సమస్తోపనిషదర్థములను వ్యాఖ్యానించి తద్వారా దుర్మతములను ఖండించిరి. దయామయులగు నా యద్వైత గురుదేవులు భాష్యాదులద్వారా వ్యక్తపరిచిన బోధలను సుగమముగా సార్వజనీన మగునట్లు బోధిప దలచి యనేక కృతు లొనర్చిరి. అందు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము, అపరోక్షానుభూతి, దశశ్లోకి, మనీషా పంచకము, సోపాన పంచకము, ఏకశ్లోకి యనునవి మిగుల ప్రాముఖ్యమైనవి. ఆ స్తోత్రరాజముల నుపనిషద్రహస్యములైన సకల యద్వైత విద్యాబోధతో నిక్షేపము గావించిరి. కాగా నేడట్టి శ్రీ భగవత్పాదుల స్తోత్రరూప యద్వైతకృతిని భక్త జన గోరికచే బ్రహ్మశ్రీ మాణిక్యశాస్త్రి మహోదయు లాంధ్రీకరించు టెంతయో ముదావహము. వ్యాససూత్రములను శంకరస్వరూపియగు భగవత్పాదులు తద్థ్పదయజ్ఞులై వ్యాఖ్యానించటంబోలె సాకల్య శంకర హృదయముననూ చానపద్ధతిలో గురుపరంపరగా గ్రహించిన శ్రీ శాస్త్రి గారు యనేక శాస్త్రీయాంశములను సర్వజన సుబోధమగునట్లు నద్వైత విద్యనంతయు రంభాఫలము వలచి చేతిలోపెట్టి నందించిన చందమున నాంధ్రీకరించిరనుట నతిశయోక్తి కానేరదని సహృదయులకు విజ్ఞప్తి చేయుచున్నాను. అస్మధ్దేశికులగు శ్రీ శాస్త్రివర్యుల యసదృశ పాండిత్యగరిమ సకల విద్వజ్జన విదితము. నాటి శ్రీ జగద్గురు శృంగేరీ పీఠా ధీశ్వరులగు అభినవ విద్యాతీర్థ, శ్రీ చరణులచే నేర్పాటుగావించబడిన శంకరజయంతీ సందర్భమైన విజయవాడలోని విద్వత్సభలోని శాస్త్రార్థ గోష్ఠియే పండిత మాణిక్యమని శాస్త్రివర్యుల నామధేయ మన్వర్ధపరచినది. శ్రీ మాణిక్యశాస్త్రిగారు విద్వన్మాణిక్యమే. శ్రీ శాస్త్రిగారు తర్కశాస్త్రమున క్రోడపత్రాది యుద్గ్రంథములకు, వేదాంతశాస్త్రమున సిద్ధి బ్రహ్మానందీయములకున్ను సుగమముగా సంస్కృతమున వ్యాఖ్యానించ పాటవముగల ధీశాలురనుట నతియోక్తికానేరదు. భక్తసులభులైన శ్రీ శాస్త్రివర్యులు పండిత పామర జనోపయుక్తముగా తమ నైజపాండిత్య గరిమతో యద్వైత విద్యనిం దభివర్షించిరి. ''విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం'' అనే మొదటిశ్లోకముననే వివర్త పరిణామవాదములకు గల విభేదము మున్నుగా గల వేదాంతశాస్త్ర పడికట్లను దేట తెల్లముగా చాటుతూ వేదాంత సిద్ధాంత భాగములను వ్యక్తపరచి వివర్తమును దేటగా సిద్థాంతీకరించిరి. మరియు నితర శ్లోకములలోను సాంక్యాది మతములను చాటుతూ నద్వైతగరిమను బహుముఖముల దేటగా బొందుపరచిరి. ఒక విషయమేమి? వేదాంత శాస్త్రమందుగల మాయావాదము, జీవబ్రహ్మైక్యము మొదలగువాటిని సాంప్రదాయపద్థతిలో శాస్త్రమంతయు పామరజనులకును సుబోధమగునట్లు నందించిరి అపరోక్షానుభూతిని తురీయభూమికలోని యఖండానందరసము నొల్కింపఁజేసిరి. ఈ గ్రంథరాజముతో తెలుగువాణి కొక క్రొత్త వన్నె దెచ్చిరని దెలియజేయుటకు సంతసించుచున్నాను కూలంకష బ్రహ్మ విజ్ఞాన సంపత్తినొందగోరు భక్తజనుల కత్యంతోపయుక్తమగు ననుటలో సందియ మావంతయులేదని భావించువాడను. తెనుగున వేదాంతశాస్త్రము నా యా గ్రంథముల ననువదించువారు మున్ను లేకపోలేదుగాని నీరీతి సాంప్రదాయ నిబద్ధమగునట్లు వేదాంతశాస్త్రమునంతయు నందించిన దీ గ్రంథమేనని నొక్కివక్కాణింపవచ్చును. వేయేల శ్రీ శాస్త్రి మహోదయులు బహుముఖముల దమప్రజ్ఞ నిందు బొందుపరచిరి. తెనుగువాడ యదృష్టమని దలంచువాడను. ఇట్లు,

సాంగస్వాథ్యాయ, వేదార్థరత్న, పండిత,

పొణుకుపాటి లక్ష్మీనరసింహ శాస్త్రి

ప్రిన్సిపాల్‌.

శంకర విద్యాలయం, బాపట్ల.

Thathva Rahasyaprabha    Chapters